ఉత్తర కాండ : శూర్పణక ఖరునివద్ద చేరుట
జనవరి 1966
శూర్పణక ఖరునివద్ద చేరుట
రావణుడు వరుణలోకం నుంచి బయలుదేరి లంకకు తిరిగివస్తూ, దారిలో కనిపించిన అందగత్తెలైన కన్యలను వేలసంఖ్యలో చెరపట్టి తెచ్చి పుష్పకంలో ఎక్కించు కున్నాడు. వాళ్ళందరూ గొల్లున ఏడుస్తూ, రావణుణ్ణి శాపనార్థాలు పెట్టారు. అతను ఇంటికి చేరుతూండగానే అతని చెల్లెలు శూర్పణఖ ఎదురువచ్చి, పెద్ద పెట్టున ఏడుస్తూ, “ఏం చెప్పేది? నా భర్తను మిగిలిన కాలకేయులతోబాటు చంపి నన్ను విథవను చేసేశావు. బావ మరిది అన్న జ్ఞానం కూడా నీకు లేకపోయింది” అని నిందించింది. “అమ్మాయీ! జరిగినదానికి ఏడ్చి లాభమేమిటి? యుద్ధోన్మాదిగా ఉన్న సమయంలో, వీడు నా వాడన్న జ్ఞానం కూడా నాకు లేకపోయింది. ఇకముందు నువు మన ఖరుడి వెంట ఉండు. వాడు నీ కేకొరతా లేకుండా చూస్తాడు. పధ్నాలుగు వేల రాక్షసులకు వాణ్ణి నాయకుడుగా చేసి, దూషణుణ్ణి కూడా తోడిచ్చి దండకారణ్యాన్ని రక్షించటానికి పంపిస్తున్నాను. వాళ్ళంతా నీకు విధేయులై ఉండి, నువు కోరినట్టు చేస్తారు.” అన్నాడు రావణుడు. ఆ ప్రకారమే శూర్పణఖ ఖరదూషణులు వెంట దండకారణ్యానికి వెళ్ళి అక్కడ సుఖంగా జీవిస్తూ వచ్చింది.
తరువాత రావణుడు నికుంఖిల వనానికి వెళ్ళి అక్కడ యజ్ఞం చేస్తున్న తన కుమారుణ్ణి, మేఘనాదుణ్ణి చూసి, కౌగలించుకుని, “ఇక్కడ ఏం చేస్తున్నావు నువు?”. అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం శుక్రాచార్యుడు చెప్పాడు. “నీ కొడుకు ఏడు యజ్ఞాలు తలపెట్టాడు. అగ్నిష్టోమము, ఆశ్వమేధమూ, రాజసూయమూ, గోమేధమూ, వైష్ణవమూ అన్నవి గాక, అత్యంత దుర్లభ మైన మహేశ్వర యజ్ఞం చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని, కామగమనంగల రథాన్నీ, అంతటా చీకటి ఆవరింపజేయుగల మాయనూ, శక్తివంతమైన ధనుర్బాణాలనూ వరంగా పొందాడు. ఇప్పుడు చేస్తున్నదే ఆఖరుయజ్ఞం.”
శుక్రాచార్యుడు చెప్పిన ఈ మాటలతో ఏమాత్రమూ తృప్తిపడక రావణుడు, “మీరు చేసిన పని ఏమీ బాగాలేదు. మన శత్రువులైన ఇంద్రాదులను అర్చించటానికి ద్రవ్యం నష్టపరిచారు. సంపాదించిన పుణ్యం చాలు,” అని మేఘనాదుణ్ణి తన వెంట తీసుకుపోయాడు. అప్పుడు విభీషనుడు రావణుడికొక దుర్వార్త చెప్పాడు. రావణుడికి చెల్లెలి వరస అయిన కుంభీనస అనే పిల్ల రావణుడి ఇంట పెరుగుతున్నది. రావణుడి తల్లికి పెదనాన్న అయిన మాల్యవంతుడి కూతురి కూతురు కుంభీనస. మధువనే రాక్షసుడు వచ్చి, ఎవరూ లేని సమయంలో దాన్ని ఎత్తుకుపోయాడు. ఆ సమయంలో రావణుడు దిగ్విజయం వెళ్ళి ఉన్నాడు, కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు, విభీషనుడు నీటిలో ముణిగి తపస్సు చేసుకుంటున్నాడు. తాను ఎందరు కన్యలను అపహరించి తెచ్చినా తన చెల్లెలిని ఎవరో అపహరించారనే సరికి రావణుడు మండి పడ్డాడు. అతను కుంభకర్ణుణ్ణి నిద్ర లేపించి, రాక్షస వీరులనూ, సైనికులనూ యుద్ధానికి సిద్ధం చేయించి, మధువు వుండే మధుపురం మీదికి వెళ్ళాడు. తన భర్తను చంపటానికి తన అన్న అయిన రావణుడు పెద్ద సేనతో వస్తున్నాడని తెలిసి, కుంభీనస ఏడుస్తూ అతనికి ఎదురు వచ్చి, “అన్నా! నీ బావమరిదిని చంపి నాకు వైధవ్యం కలిగించకు,” అని బతిమాలింది. రావణుడు కుంభీనస దైన్యానికి కరిగి, “నీ భర్తను చంపనులే. అతను ఎక్కడ ఉన్నాడో చూపించు. నేను దేవతలను జయించటానికి స్వర్గానికి వెళుతున్నాను.. అతన్ని కూడా వెంట తీసుకుపోతాను,”. అని చెప్పాడు. కుంభీనస తన భర్త అయిన మధువు వద్దకు వెళ్ళి, ” మా అన్న నిన్ను దేవతలతో యుద్ధం చెయ్యటానికి పిలుస్తున్నాడు. వెళ్ళు. అలాటి వాడి స్నేహం మనకు చాలా మంచిది,” అని చెప్పింది. మధువు రావణుడి వద్దకు వచ్చి, అతన్ని అర్ఘ్యపాద్యాలతో సత్కరించి, ఎన్నో మర్యాదలు చేశాడు, రావణుడు ఒక్క రాత్రి తన బావమరిది ఆతిథ్యం స్వీకరించి, మర్నాడు బయలుదేరి వైశ్రవణుడుండే కైలాసం వద్దకు చేరుకున్నాడు. అప్పటికి సాయంకాలం కావటం చేత రావణుడి సేన అక్కడే విడిసింది.