కిష్కింధా కాండ : వాలి సుగ్రీవుల వైరము
మే 1963
వాలి సుగ్రీవుల వైరము
సుగ్రీవుడి మాటలు విని రాముడు “మీ ఇద్దరి మధ్యగల వైర కారణమేమిటో తెలుసుకోవాలని ఉన్నది. ఆ కారణమూ, మీ బలాబలాలూ తెలుసుకున్న మీదట నీకు సుఖం కలిగే మార్గం ఆలోచించ గలుగు తాను,” అన్నాడు. దానికి సుగ్రీవుడిలా చెప్పాడు. "మా అన్న అయిన వాలిని నా తండ్రీ, నేనూ ఎంతో గౌరవంతో చూసే వాళ్ళం. మా తండ్రి పోయాక, పెద్దవాడు గనక వాలి రాజ్యానికి వచ్చాడు. నేను వాలికి సేవకుడు లాగా ఎంతో వినయవిధేయతలు చూపేవాణ్ణి. దుందుభి అనేవాడి పెద్ద కొడుకు మాయావి అనే రాక్షసుడు చాలా గొప్ప పరాక్రమశాలి. ఒక స్త్రీ విషయంలో మాయావికీ, వాలికి తగాదా వచ్చింది. ఒకనాటి అర్థరాత్రివేళ ఆ మాయావి కిష్కింధ ద్వారం వద్దకు వచ్చి, పెద్దపెట్టున గర్జిస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి నిద్ర మేలుకొని మాయావి మదం అణచటానికి బయలుదేరాడు. నేనూ, ఆడవాళ్ళూ ఎంత ఆపినా వాలి ఆగలేదు. అతను ఒంటరిగా పోతున్నాడే అని నేను కూడా వెంటవెళ్ళాను.
మాయావి మా అన్నను చూస్తూనే భయపడి పారిపోసాగాడు. మేమతని వెంట పడ్డాం. ఇంతలో చంద్రోదయం కూడా అయింది. మాకూ తనకూ ఉండే దూరంక్రమంగా తగ్గుతూండటం చూసి మాయావి ఒక బిలంలో దూరాడు. “వాలి ఆ బిలంలోకి వెళ్ళి మాయావిని చంపివస్తాననీ, తాను వచ్చేదాకా నన్ను బిలం వెలపల ఉండమనీ చెప్పాడు. నేను కూడా వస్తానంటే వినక, తన పాదాలమీద ప్రమాణం చేయించుకుని వాలి ఆ బిలం ప్రవేశించాడు.
“మా అన్న కోసం ఆ బిల ద్వారం వద్ద పూర్తిగా ఒక సంవత్సరం కాచుకుని ఉన్నాను. వాలి జాడలేదు. వాలి చనిపోయి ఉంటాడేమోనని నాకు భయమూ, అనుమానమూ కలిగాయి. నా భయానికి తగ్గట్టుగా బిలం నుంచి నురుగుతో కూడిన ఎఱ్ఱని రక్తం రాసాగింది. లోపల నుంచి గర్జనలూ, ఆక్రందనలూ వినిపించాయి. ఆక్రందన ధ్వని వాలిదిలాగా నాకు తోచింది. ఈ లక్షణాలన్నీ గమనించి వాలి చని పోయాడనుకుని నాకు భయమూ, దుఃఖమూ కలిగాయి. నేను ఆ బిల ద్వారాన్ని పెద్ద కొండరాయితో మూసి, వాలికి జలతర్పణాలు విడిచి కిష్కింధకు తిరిగి వచ్చాను. వాలి మరణ వార్త నేనేమీ చెప్పకపోయినప్పటికీ మంత్రులు నా నుంచి రాబట్టి, తమలోతాము ఆలోచించుకుని నాకు పట్టాభిషేకం చేశారు.
నేను రాజ్యపాలన చేస్తూండగా వాలి మాయావిని చంపేసి తిరిగి వచ్చాడు. “నేను రాజు నయానని తెలిసి వాలి మండిపడ్డాడు. మంత్రులను బంధించాడు. నన్ను నానా మాటలూ అన్నాడు. నేను గౌరవంగా వాలికి నమస్కారం చేశాను. అతను నన్ను ఆశీర్వదించ లేదు. నా కిరీటం తీసి అతని పాదాల దగ్గిర పెట్టాను. కాని అతని కోపం చల్లారలేదు. అతన్ని రాజ్యం చెయ్యమని వేడుకున్నాను. బిలం దగ్గిర నేను చూసినదీ, విన్నదీ చెప్పాను. బిలానికి రాయి ఎందుకు అడ్డంగా పెట్టానో చెప్పాను. నేను రాజ్యాభిషేకం కోరలేదనీ, రాజ్య క్షేమం కోరి మంత్రులే నాకు పట్టంగట్టారనీ అన్నాను. నీవు లేనప్పుడు రాజుగా పని చేశానుగాని, ఇప్పుడు నీకు యువరాజు నేనని కూడా చెప్పాను.
“వాలి ఇదేదీ లక్ష్యపెట్టాడుకాడు. తన కిష్టులైన మంత్రుల ముందు నన్ను నానా దుర్భాషలూ ఆడాడు. అతను బిలంలో ప్రవేశించాక ఒక ఏడాదిపాటు మాయావి కనిపించనే లేదట. తరువాత వాణ్ణి, వాడి బంధువుల నందరినీ చంపాడట. రక్తం ప్రవహించే నారంభించగానే దుర్గంధం భరించలేక బిల ద్వారం వద్దకు వచ్చి నన్ను పిలిచాడట. నేను తన కోసం వేచి ఉండక పోగా, తనను బిలంలో బంధించటానికి రాయి అడ్డు పెట్టానని వాలి తన మంత్రులతో అన్నాడు. ఇలా నాపై నింద మోపిన అనంతరం అతను నన్ను కట్టుబట్టలతో కిష్కింధ నుండి వెళ్ళగొట్టేశాడు. నా భార్యను కాజేశాడు.
ఈ విధంగా అన్న చేత వెళ్ళగొట్టబడి నేను ప్రపంచమంతా తిరిగాను. చిట్టచివరకు నాకీ ఋశ్యమూకం మీద నిలవనీడ దొరికింది. ఎందుకంటే ఒకానొక కారణం చేత వాలి ఈ పర్వతంపైన అడుగు పెట్టలేడు. నా వల్ల ఏ తప్పూ లేకపోయినప్పటికీ నేనిలా కష్టాల పాలయాను. ఇక వాలియొక్క శక్తి సామర్ధ్యాలు చెబుతాను. అతను సూర్యోదయానికి పూర్వమే నాలుగు దిక్కుల సముద్రాలూ సునాయాసంగా చుట్టి వస్తాడు. పర్వత శిఖరాలపై కెక్కి కొండరాళ్ళను బంతుల్లాగా ఎగరేసి పట్టుకుంటాడు. పెద్ద పెద్ద అడవి మానులను అవలీలగా విచేయగలడు.
దున్నపోతు రూపంలో దుందుభి అనే రాక్షసుడు మహా బలశాలి ఉండేవాడు. వాడిది వెయ్యి ఏనుగుల బలం. వాడు బలగర్వితుడై సముద్రుడి వద్దకు వెళ్ళి తనతో యుద్ధానికి రమ్మని పిలిచాడు. సముద్రుడు మానవ రూపంలోపైకి వచ్చి దుందుభితో, "నీ బోటి యుద్ధ విశారదుడితో యుద్ధంచేసే శక్తి నాకైతే లేదుగాని అలాటి శక్తి గల వాడెవడైనా ఉంటే అది హిమవంతుడు. నీవు అతనితో యుద్ధం చేస్తే బాగుంటుంది," అని చెప్పాడు. “దుందుభి శరవేగంతో హిమాలయానికి వెళ్ళి, తన కొమ్ములతో గుండురాళ్ళను విరజిమ్ముతూ, రంకెలు పెట్టి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు. హిమవంతుడు దుందుభితో, "నాయనా! నేను నీతో యుద్ధం చెయ్యలేను, నన్నెందుకు బాధిస్తావు? అదీగాక ఇక్కడ ఎందరో మునులు తపస్సు చేసుకుంటున్న కారణం చేత యుద్ధానికి వీలుపడదు. కిష్కింధలో వాలి అనే వానర శ్రేష్ఠుడున్నాడు. యుద్ధంలో అతను నీ తీట తీర్చగలడు" అని చెప్పాడు.
“దుందుభి కిష్కింధకు వచ్చి ద్వారం వద్ద నేలను గిట్టలతో గీరుతూ ఆర్భాటం చేశాడు. వాడు చేసే ఆగడం సహించలేక వాలి అంతఃపుర కాంతలతో సహా బయలుదేరి వచ్చాడు. అతను దుందుభితో, "ఓరీ! నేను నిన్నెరుగుదును. ఎందుకు రంకెలు పెడుతున్నావు? ప్రాణాల మీద ఆశ లేదా?" అన్నాడు. దుందుభి మండిపడి “స్త్రీల ఎదట బీరాలు పలకటం కాదు, నాతో యుద్ధం చెయ్యి. ఇప్పుడు కాకపోతే, ఈ రాత్రి అంతా సుఖంగా గడిపి, నీ వానరుల కందరికీ అప్పగింతలు చెప్పి నీ స్థానంలో మరొక రాజును ఏర్పాటు చేసుకుని, ఆఖరుసారి కిష్కింధ అంతా చూసుకుని రేపు ఉదయం యుద్ధానికి రా! అంతదాకా నీకు గడువిస్తాను” అన్నాడు.
వాలి దుందుఖిని చూసి హేళనగా నవ్వి, తార మొదలైన అంతఃపుర స్త్రీలను పంపేసి, తనకు ఇంద్రుడిచ్చిన కాంచన మాలను మెడలో వేసుకుని యుద్ధానికి వచ్చాడు. ఇద్దరికీ భయంకరమైన యుద్ధం జరిగింది. వస్తూనే వాలి దుందుభి కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి విసిరి నేలకేసి కొట్టాడు. దెబ్బకు దుందుభి చెవుల నుంచి రక్తం కారింది. క్రమంగా వాలి బలం హెచ్చింది, దుందుభి బలం క్షీణించింది. చివరకు వాలి ఆ రాక్షసుడిని ఎత్తి నేలకు వేసి కొట్టి చంపాడు. అలా చచ్చిన దుందుభి కళేబరాన్ని వాలి ఎత్తి ఆమడ దూరాన వెళ్లిపడేలాగా విసిరి వేశాడు. ఆ కళేబరం నోట కారే రక్తపు చుక్కలు మతంగ మహాముని ఆశ్రమంలో పడ్డాయి. ఆ నెత్తురు చుక్కలు చూసి మతంగుడు మండిపడి ఆశ్రమం దాటి వచ్చి దుందుభి కళేబరాన్ని చూసి, "ఈ రాక్షస కళేబరాన్ని ఇక్కడికి విసిరిన వాడుగాని, వాడి అనుచరులుగాని ఈ వనంలోకి వస్తే చస్తారు!" అని శపించాడు.
“మతంగ మహాముని శాపం విని ఆ ప్రాంతాల ఉండే వాలి అనుచరులు భయపడి వెళ్లిపోయి వాలితో ఈ సంగతి చెప్పారు. శాపవిమోచనం చెయ్యమని వాలి వేడుకున్నప్పటికీ మతంగుడు అనుగ్రహించలేదు. అది మొదలు వాలి ఈ ఋశ్యమూకం చాయలకు రాడు. ఆ సంగతి తెలిసి నేను నా మంత్రులతో ఇక్కడ తలదాచుకున్నాను. అదుగో, గుట్టలాగా కనిపించే దుందుభి కళేబరం! వాలి బలానికి మరొక ఉదాహరణ కూడా చెబుతాను. ఆ కనిపించే ఏడు సాల వృక్షాలున్నాయే, వాటిలో దేని కాండంలో నుంచి అయినా దూసుకుపోయేలాగా వాలి బాణం వేయగలడు. ఇంత శక్తిమంతుణ్ణి నీవు ఏ విధంగా వధిస్తావో!”