వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

కిష్కింధా కాండ : సుగ్రీవునిపై లక్ష్మణుని ఆగ్రహం

సుగ్రీవునిపై లక్ష్మణుని ఆగ్రహం

 లక్ష్మణుడికి కూడా సుగ్రీవుడిపై పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను రాముడితో, “నీ మూలానే తనకు రాజ్యప్రాప్తి, భార్యాప్రాప్తి కలిగిందని కూడా తలచకుండా సుగ్రీవుడు, తాగి భార్యలతో తలకిందులై పోతున్నాడు. ఇలాటివాణ్ణి రాజుగా ఉండనివ్వరాదు. నాకు మండిపోతున్నది. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి వాలి దగ్గిరికి పంపించేస్తాను, సీతను వెతకటానికి అంగదుడున్నాడు, వానర వీరులున్నారు,” అన్నాడు, బాణాలు తీసుకుని బయలుదేరుతూ. రాముడు లక్ష్మణుడితో శాంతంగా, “లక్ష్మణా, తొందరపడకు. మిత్రవధ చేసి నిష్కారణంగా పాపం అంటగట్టుకోకు. సుగ్రీవుడు అన్న సమయానికి రాకపోవటం తప్ప వేరే మహాపరాధం ఏం చేశాడు? నీవు వెళ్ళి అతనితో మృదువుగానే మాట్లాడు,” అని అతన్ని పంపేశాడు.

 లక్ష్మణుడు కిష్కింధ చేరి సుగ్రీవుడి ఇంటికి బయలుదేరాడు. అణగని కోపంతోనూ, అతివేగంతోనూ పోతున్న లక్ష్మణుణ్ణి చూసి పెద్ద పెద్ద వానర వీరులు, అతనెవరో శత్రు వనుకుని, అతనిపైన వెయ్యటానికి చెట్లు పీకారు. అది చూసి లక్ష్మణుడు వారి కేసి నిప్పులు కక్కుతూ చూశాడు. దానితో వారు భయపడి దూరంగా తొలగారు. కొందరు సుగ్రీవుడి ఇంటికి వెళ్ళి లక్ష్మణుడు వస్తున్నాడని చెప్పారు. కాని సరస సల్లాపాలలో ముణిగి ఉన్న సుగ్రీవుడా మాట వినిపించుకోలేదు.

 ఈలోపల సుగ్రీవుడి మంత్రులు, లక్ష్మణుడు నిజంగా వస్తున్నాడేమో చూసి రమ్మని కొందరు వానరులను పంపారు. వాళ్ళతో బాటు వచ్చిన అంగదుణ్ణి చూసి లక్ష్మణుడు, ” నేను వచ్చానని సుగ్రీవుడితో చెప్పు. నాతో మాట్లాడతాడో లేదో, తెలుసుకుని వెంటనే రా!” అన్నాడు. అంగదుడు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి, అతనికి నమస్కారం చేసి, లక్ష్మణుడు చెప్పమన్నట్టే చెప్పాడు. కాని సుగ్రీవుడు తాగిన మత్తులో ఉండి ఏమీ వినిపించుకోలేదు. అయితే లక్ష్మణుడి రౌద్రాకారం చూసి వానరులు చేసిన కలకలానికి సుగ్రీవుడి మత్తు కొంత వదిలింది. అంగదుడు అవతలికి వెళ్ళి ప్లకుడూ, ప్రభావుడూ అనే మంత్రులతో సుగ్రీవుడి వద్దకు తిరిగి వచ్చేసరికి అతను కొంత స్పృహలో ఉన్నాడు. వారు అతనితో లక్ష్మణుడు మాట్లాడటానికి వచ్చాడని చెప్పారు. లక్ష్మణుడు ఉత్తగాకాక ధనుర్బాణాలతో సహావచ్చాడనీ, చాలా కోపంలో ఉన్నాడనీ సుగ్రీవుడికి తెలిసింది.

 సుగ్రీవుడు మంత్రులతో, “నేనేమీ తప్పు చేయలేదే, లక్ష్మణుడికి ఆగ్రహం ఎందుకు కలిగి ఉంటుందీ? నా శత్రువు లెవరో అతనితో నాపై చాడీలు చెప్పి ఉంటారు. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి అతని కోపకారణం తెలుసుకోవాలి. రామలక్ష్మణులంటే నాకు భయమని కాదు, కానీ మిత్రుడికి కోపం వచ్చినప్పుడు ఆందోళన చెందటం సహజం. రాముడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యటం నాకు సాధ్యంకాదు,” అన్నాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, “రాజా! రాముడికి నీ మీద అలక వచ్చి ఉంటుందేగాని నిజమైన ఆగ్రహం రాదు. నీవు ఏమరుపాటున శరదృతువు రావటం గమనించలేదు. అందుకే లక్ష్మణుడు వచ్చి ఉంటాడు. అతను కాస్త పరుషంగా మాట్లాడినా నీవు సహించాలి, ఎందుకంటే తప్పు నీదే. రాముడికి ఆగ్రహం తెప్పించటం ఎవరికీ మంచిది కాదు. అతని వల్ల లాభం పొందిన నీకు అది బొత్తిగా అనుచితం,” అన్నాడు. ఈలోపుగా లక్ష్మణుడు సుగ్రీవుడి అంతఃపురం దాకా వచ్చి, లోపల ఆడవాళ్ళ అలికిడి విని అక్కడే ఆగిపోయాడు.

 లక్ష్మణుడు చేసిన ధనుష్టంకార ధ్వని విని సుగ్రీవుడు అతని ఎదట పడడానికి జంకి, లక్ష్మణుడితో మాట్లాడమని తారను పంపాడు. తార లక్ష్మణుడున్న చోటికి వచ్చి, “మీకు కోపం వచ్చిందిట, దేనికి? మీ మాటను ఎవరైనా అతిక్రమించారా?” అని అడిగింది. “సుగ్రీవుడు అస్తమానమూ తాగి ఉండి రాచకార్యాలు చూడడు, మా సంగతి ఆలోచించడు, నీకు తెలియదా? యుద్ధ సన్నాహానికి నాలుగు మాసాలు వ్యవధి తీసుకున్నాడు. గడువు దాటిపోయింది. మా పని ప్రారంభం కాలేదు. మేమేం చెయ్యాలో నీవే చెప్పు,” అన్నాడు లక్ష్మణుడు. తార అతనితో, “సుగ్రీవుడు భోగలాలసుడై ఉన్నందుకు ఆగ్రహించ వద్దు. అతను మీ పని మరవలేదు ఇదివరకే అతను మీ పనికి వానరులను హెచ్చరించాడు. ఎక్కడెక్కడి పర్వతాల నుండో వానరులు లక్షల కోట్ల సంఖ్యలో వచ్చి చేరారు,” అని చెప్పి అతన్ని తన వెంట అంతఃపురంలోకి తీసుకుపోయింది.

 తీరా లక్ష్మణుడులోపలికి వెళ్ళే సరికి సుగ్రీవుడు, తాగిన మత్తులో ఎఱ్ఱబడిన కళ్ళతో, అనేకమంది స్త్రీల నడుమ కనిపించాడు. లక్ష్మణుడికి అతన్ని చూడగానే మండిపోయింది. అతను సుగ్రీవుణ్ణి చూసి, “ఉపకారం చేసిన మిత్రులకు అబద్దపు ప్రతిజ్ఞ చేసేవాడు పరమపాపి. కృతఘ్నుడు. వాణ్ణి ఎవరైనా చంపవచ్చు. రాముడి చేత నీ పని పూర్తి చేయించుకుని సీతను వెతికే ప్రయత్నం ప్రారంభించిని నీవు కృతఘ్నుడవు. వాలి వెళ్ళిన దారి జ్ఞాపకం ఉంచుకుని సీత కోసం వెతికించు,” అన్నాడు.