వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

కిష్కింధా కాండ : సంపాతిని కనుగొనుట

సంపాతిని కనుగొనుట

 అంగదుణ్ణి చూసి వానరులందరికీ ఆగకుండా దుఃఖం వచ్చింది. వాళ్ళు వాలిని మెచ్చుకుని సుగ్రీవుణ్ణి తిట్టుతూ, తాము కూడా ప్రాయోపవేశం చేయ నిశ్చయించారు. సముద్రంలో స్నానం చేసి తీరాన దర్భలు పరిచి వారంతా తూర్పు ముఖంగా పడుకున్నారు. అలా పడుకుని వారు రాముడు అరణ్యవాసానికి బయలుదేరినది మొదలు జరిగిన సంఘటనలన్నీ చెప్పుకుంటూ ఉండగా ఒక భయంకరమైన ఆకారం గల గద్ద వారికి కనిపించింది. దానిని చూస్తూనే భయంతో వారు పెట్టిన కేకలకు గుహలన్నీ మారుమోగాయి.

 ఆ వచ్చినది జటాయువు అన్న అయిన సంపాతి. అతను వింధ్య పర్వతం మీది ఒక గుహలో ఉంటున్నాడు. అతను గుహలో నుంచి వెలికి వచ్చి, “దేవుడి దయ వల్ల ఇవాళ నాకు కావలిసినంత ఆహారం! ఈ వానరులందర్నీ వరసగా చంపి కడుపు నింపుకుంటాను,” అన్నాడు. ఆ మాటలు విని అంగదుడు హనుమంతుడితో, “మన కెలాటి గతి పట్టింది? యముడు ఈ గద్ద రూపంలో మనని కడతేర్చ వచ్చాడు. మనమా రాముడి పని తీర్చినవాళ్ళమూ కాలేదు, సుగ్రీవాజ్ఞ నిర్వర్తించిన వాళ్ళమూ కాలేదు. మన కన్న ఆ జటాయువు మేలు; అతను రాముడి కోసం ప్రాణాలు వదిలాడు. మనం రామ కార్యం మీద బయలుదేరామన్న మాటేగాని అది చెయ్యకుండానే ఈ గద్ద నోట పడబోతున్నాం. మన చావుకు ఎన్ని కలిసివచ్చాయో ! జటాయువు ప్రాణాలు వదలక పోతే మనకు సీతను వెతక వలిసిన పనే ఉండేది కాదు; రావణుడి సంగతి అతనే చెప్పేవాడు. రావణుడు సీత నెత్తుకు పోక పోతే ఆమె కోసం వెతికే పనే ఉండేది కాదు. దశరథుడు చావకపోతే ఏనాడో రాముణ్ణి పిలిపించుకుని ఉండేవాడు. అసలు దశరథుడా కైకేయికి వరాలే ఇవ్వకపోతే ఏ బెడద ఉండకనేపోను. ఇవన్నీ మన వానరులందరి ప్రాణం తియ్యటానికే జరిగాయి,” అన్నాడు.

 సంపాతి గట్టిగా, “ఎవడది? నా తమ్ముడు చచ్చిపోయినట్టు మాట్లాడుతున్నాడు! ఇంత కాలానికి నా తమ్ముడి పేరు విన్నాను గదా అని సంతోషించాను. నాయనలారా! నా రెక్కలు సూర్య కిరణాలకు కాలిపోయాయి. నేను మీ దగ్గిరికి రాలేను. దయచేసి నన్ను మీరున్న చోటికి దించండి” అని అరిచాడు. వానరులు ఇదంతా దొంగ ఎత్తనుకున్నారు. అయినా తాము చావటానికి సిద్ధమయే ఉన్నారు గనక ఆ చావు ఈ విధంగా త్వరగా రావటం కూడా మేలేనేమోనని వారికి తోచింది. అంగదుడు మాత్రం లేచి వెళ్ళి సంపాతిని కొండ మీది నుంచి దించి కిందికి తెచ్చాడు.అతను సంపాతితో రాముడు అరణ్య వాసం రావటమూ, జనస్థానంలో ఉన్న సీతను రావణుడు అపహరించటమూ, అది చూసి జటాయువు రావణుడితో ఘోర యుద్ధం చేసి చనిపోవటము, రామ లక్ష్మణులు సీతను వెతుక్కుంటూ ఋశ్యముకానికి వచ్చి, సుగ్రీవుడి స్నేహం చేసి, వాలిని చంపి, వానర రాజ్యాన్ని సుగ్రీవుడి కివ్వటమూ, సుగ్రీవుడు సీతాన్వేషణకై తమను పంపటమూ, తాము విఫలులై, తిరిగి వెళ్ళలేక ప్రాయోపవేశం చెయ్యటమూ వివరించి చెప్పాడు.