వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

అయోధ్య కాండ : సీతారామలక్ష్మణులు వనవాసానికి బయలుదేరుట

మార్చి 1962
సీతారామలక్ష్మణులు వనవాసానికి బయలుదేరుట

  వీధిలో అందరూ దైన్యంతో చూస్తున్నారు. కొందరు రథం వెనక పరిగెత్తు తున్నారు. కొందరు రథం పక్కలు పట్టుకుని వేళ్ళాడుతున్నారు. కొందరు రథానికెదురుగా వచ్చి సుమంత్రుణ్ణి, ” మళ్ళీ ఎప్పటికి చూస్తామో, కాస్సేపు, చూడనియ్య. రథం మెల్లిగా తోలు, బాబూ!” అని బతిమాలాడారు.

 వీధిలో అందరూ దైన్యంతో చూస్తున్నారు. కొందరు రథం వెనక పరిగెత్తు తున్నారు. కొందరు రథం పక్కలు పట్టుకుని వేళ్ళాడుతున్నారు. కొందరు రథానికెదురుగా వచ్చి సుమంత్రుణ్ణి, ” మళ్ళీ ఎప్పటికి చూస్తామో, కాస్సేపు, చూడనియ్య. రథం మెల్లిగా తోలు, బాబూ!” అని బతిమాలాడారు. ఉన్నట్టుండి దశరథుడు, “నేను రాముణ్ణి చూడాలి!” అంటూ తన యింటినుంచి బయటికివచ్చి వీధినపడ్డాడు. ఆయనతోబాటు ఆయన భార్యలు కూడా వీధివెంట పరిగెత్తసాగారు. “సుమంత్రుడా, రథం కాస్త ఆపు” అని కేక పెట్టాడు దశరథుడు. ఆయన కొంత దూరం పరిగెత్తి పడిపోయాడు. వెనక్కు తిరిగి చూస్తున్న రాముడి కీ దృశ్యం దుర్బరమైంది. అతను సుమంత్రుడితో, “రథం వేగంగా తోలు. ఈ దుఃఖాన్ని ఎంతసేపు చూడగలను? ఎలా చూడటం? అంతగా మహారాజు అడిగితే, జనం చేసే గోలలో ఆయన కేక వినిపించలేదని బొంకు,” అన్నాడు. రాముడు రథాన్ని వెన్నంటి వచ్చే వారి వద్ద సెలవు పుచ్చుకున్నాక సుమంత్రుడు గుఱ్ఱాలను వడిగా తోలాడు.

 దశరథుడితో మంత్రులు, “మహారాజా, వాళ్ళు త్వరగా రావాలనుకున్నట్లయితే వారిని ఎక్కువ దూరం సాగనంప గూడదు,” అని చెప్పారు. దశరథుడు శరీరమంతా చెమటలు దిగాయి, భార్యలతో సహా అక్కడే నిలబడి, క్రమంగా దూరమై పోతున్న రథాన్ని చూశాడు.

 రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్లిపోవడంతో దశరథుడి అంతఃపురం రోదన ధ్వనులతో నిండిపోయింది. దానితోబాటే అయోధ్య నగరమంతా పాడు పడినట్టయి పోయింది. ఎక్కడి పనులక్కడ ఆగి పోయాయి. జనులంతా ఏదో ఉపద్రవం జరిగిపోయినట్టుగా విస్తుపోయారు. రాముడి వెనుక కొంతదూరం వెళ్ళి దారిలో పడిపోయిన దశరథుణ్ణి కౌసల్య, కైకేయీ చెరొక రెక్క పట్టుకుని నిలబెట్టారు. దశరథుడు కైకేయితో, “నన్నంటకు. నేను నీ భర్తను కాను. నిన్ను విడిచి పెట్టేశాను. నీ కొడుకు నాకు తిలోదకాలిస్తే అవి నాకు ముట్టవు” అన్నాడు. ఆయన రాముడి కోసం ఇంకా ఏడుస్తూ కౌసల్య ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి రాముడికోసం విలపించే కౌసల్య దశరథులను సుమిత్ర తగినవిధంగా ఊరడించింది.

ఈలోపల సీతా రామ లక్ష్మణు లెక్కిన రథం సూర్యాస్తమయ వేళకు తమసానదీ తీరం చేరింది. పురజనులు అక్కడిదాకా రథాన్ని వెంబడించి వచ్చారు. వారు రాముణ్ణి ఆరణ్యవాసం వెళ్లకుండా నిర్బంధం చేసారు. రాముడెన్ని చెప్పినా వారు వినిపించుకోలేదు. సుమంత్రుడు గుఱ్ఱాలను విప్పి, కడిగి, నీరు తాగించి, నది ఒడ్డున తిరగనిచ్చి, తరువాత కట్టివేసి మేతపెట్టాడు. సుమంత్రుడు

 లక్ష్మణుడూ తయారుచేసిన ఆకుల పక్కమీద పడుకుని రాముడూ, సీత నిద్రపోయారు. సుమంత్రుడూ, లక్ష్మణుడూ రాత్రి అంతా కబుర్లతో గడిపారు. రాముణ్ణి వెంబడించి వచ్చిన పౌరులు కూడా నది ఒడ్డునే నడుములు వాల్చి నిద్రపోయారు. తెల్లవారుతూండగా రాముడు లేచి, ఇళ్ళు వాకిళ్ళు విడిచి చెట్ల కింద నిద్రపోతున్న పౌరులను చూసి, లక్ష్మణుడితో, “వీరంతా లేవకముందే మనం రథమెక్కి సాగిపోవటం మంచిది. లేకపోతే వీరు మనని వదలరు. మనతోపాటే వచ్చేస్తారు” అన్నాడు.

 సుమంత్రుడు రథం సిద్ధంచేసి తెచ్చాడు. రాముడు సుమంత్రుడితో, “రథాన్ని అన్నివైపులా తిప్పి తీసుకొనిరా. అప్పుడు జనం మనం వెళ్లిన జాడ తెలుసుకోలేక పోతారు.” అన్నాడు. సుమంత్రుడు రథాన్ని. అలాగే తిప్పి తెచ్చినాక సీత రామ లక్ష్మణులు దానిపై ఎక్కి కూచుని ఉత్తరంగా బయలుదేరారు. తెల్లవారి జనం నిద్రలేచి చూస్తే రథం లేదు, సీత రామ లక్ష్మణులు లేరు. తమను వంచించిన నిద్రనూ, దైవాన్ని తిట్టుకుంటూ వారు అయోధ్యకు తిరిగి వెళ్ళారు. తెల్లవారే సరికే రాముడి రథం చాలా దూరం వెళ్ళిపోయింది. అది దక్షిణ కోసల దేశాన్ని గడిచి, కోసలకు దక్షిణంగా ప్రవహించే గంగానది చేరుకుంది.