వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

అయోధ్య కాండ : సీతారామలక్ష్మణులు వనవాసానికి సిద్దమగుట

ఫిబ్రవరి 1962
సీతారామలక్ష్మణులు వనవాసానికి సిద్దమగుట

 ఆ భార్యా భర్తల సంభాషణ' అంతా వింటూ ఉన్న లక్ష్మణుడు, “అన్నా! నీవు అరణ్యానికి వెళ్ళటానికే నిశ్చయించినట్టయితే నేను కూడా వస్తున్నాను.” అన్నాడు. ఇందుకు రాముడు సమ్మతించక, 'నీవు, నేను కూడా వెళ్ళిపోతే మన తల్లులు కౌసల్య సుమిత్రలు దిక్కులేని వాళ్ళవుతారు. వాళ్ళను కనిపెట్టుకుని ఉండు.” అన్నాడు.

 వాటిలో అక్షయతూణీరాలూ, భయంకర కారాలు గల ధనుస్సులూ, దుర్భేద్యమైన కవచలూ, బంగారు పూతగల రెండు కత్తులూ ఉన్నాయి. లక్ష్మణుడు వెళ్ళి తాను అడవికి పోతున్న సంగతి తన మిత్రులందరికీ చెప్పి, వసిష్ఠుడి వద్దనున్న ఆయుధాలు తెచ్చాడు. తరువాత రాముడు యాత్రాదానాలు చేశాడు. వసిష్ఠుడి కొడుకైన సుయజ్ఞుణ్ణి పిలిపించి, ఆయన భార్యకు సీతచేత ఆమె నగలూ, మంచము, పరుపులూ దానం చేయించి, తాను శత్రుంజయమనే ఏనుగునూ, అనేక ఇతర ఏనుగులనూ ఇచ్చి పంపాడు. అగస్త్య కౌశికులనే బ్రాహ్మణులకూ, కౌసల్యను ఆశ్రయించుకుని ఉన్న ఒక వృద్ధ వేద పండితుడికి, దశరథుడికి ఇష్టుడైన చిత్రరథుడనే సారథికి, బ్రహ్మ చారులకూ అంతులేని గోవులూ, బంగారమూ, మణులూ, బట్టలూ దానం చేశాడు. లక్ష్మణుడు ఒప్పుకోలేదు. “నేను రాత్రి, పగలూ నీకు కావలసిన పనులన్నీ చేస్తాను. నేను నీ వెంట వచ్చితీరాలి,” అన్నాడు. రాముడు సంతోషించి సరేనన్నాడు. వసిష్ఠుడి వద్ద ఉండే దివ్యాయుధాలు రమ్మని లక్ష్మణుణ్ణి పంపాడు.

 అయోధ్యకు సమీపంగా అరణ్యంలో ఒక ముసలి బ్రాహ్మణుడుండేవాడు. ఆయన పేరు త్రిజటుడు. ఆయనకు గంపెడు పిల్లలూ, పడుచు భార్యా ఉన్నారు. ఆయన పరిగ ఏరుకుని, కందమూలాలు తవ్వుకుని సంసారం నెట్టుకొస్తున్నాడు. రాముడు యాత్రాదానాలు చేస్తున్న మాట ఎలాగో తెలిసి త్రిజటుడు, చిరిగిన పైబట్ట కప్పుకుని రాముడి వద్దకు వచ్చి, “రాజపుత్రా! నేను పేదవాణ్ణి. చాలామంది బిడ్డలు గలవాణ్ణి. ఇంత కాలం పరిగ ఏరుకు బతుకుతున్నాం. కాస్త నన్ను కటాక్షించు,” అన్నాడు. రాముడాయనతో నవ్వుతలకు, ” అయ్యా! నీవు నీ బలంకొద్దీ కఱ్ఱ విసురు. అది ఎంత దూరాన పడుతుందో అంత బారున గోవుల నిస్తాను,” అన్నాడు.

 ముసలి త్రిజటుడు నడుము బిగించి, ఒక కఱ్ఱ తీసుకుని గిరగిరా తిప్పివిసిరేసరికి, ఆది సరయూనది అవతలి గట్టున వెళ్ళిపోయింది. రాముడు త్రిజటుణ్ణి ఆప్యాయంగా కౌగ లించుకుని, “అయ్యా, నవ్వుల కన్నాను, కోప్పడ వద్దు. నీ తపశ్శక్తి ఎంతో తెలుసుకుందా మనిపించింది. అన్నప్రకారం గోవుల నివ్వటమేగాక ఇంకేమన్నా కావాలన్నా ఇస్తాను” అన్నాడు. త్రిజటుడు రాముణ్ణి దీవించి అవుల మందలను తోలుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈవిధంగా దానాలతో ఆబాలగోపాలాన్ని తృప్తి పరచి రాముడు సీత లక్ష్మణులతో తండ్రి నగరానికి బయలుదేరాడు. దశరథుడు సీతా రామలక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు. సీత రామలక్ష్మణులు వీధుల వెంబడి పోతుంటే మేడల మీది నుంచీ, మిద్దెల మీది నుంచి చూస్తే పౌరులకు కడుపు మండిపోయింది. వాళ్ళు రకరకాలుగా తమలో తాము మాట్లాడుకున్నారు.

“చూడండఱ్ఱా, రాముడు కాలినడకను భార్యనూ, తమ్ముణ్ణి వెంటబెట్టుకుని ఎలా పోతున్నాడో! కాకపోయినా ఈ దశరథుడికేదో దయ్యం పట్టినట్టుంది. ఎంత దుర్మార్గుడైన రాజైనవాడు కొడుకును అడవులకు పంపుతాడా? బంగారంలాటి రాముణ్ణి అడవికి పంపిస్తున్నాడే! మన మందరమూ కుటుంబాలతో సహా రాముడి వెంటపోతే రోగం వదిలిపోతుంది !" పౌరులు గట్టిగా అనుకునే, ఈ మాటలన్నీ వింటూ సీతా రామలక్ష్మణులు దశరథుడి నగరుచేరి, సుమంత్రుడి ద్వారా తాము ఆయనను చూడవచ్చినట్టు రాజుకు కబురు చేశారు. చేతులు జోడించి వచ్చే రాముడు కనబడగానే దశరథుడూ, ఆయన అంతఃపుర స్త్రీలూ లేచి నిలబడ్డాడు. దశరథుడు రాముడి కెదురు పోబోయి మధ్య దారిలోనే పడిపోయాడు. ఆయనను ఎత్తి పాన్పుపై పడుకోబెటారు. స్పృహ వచ్చి దశరథుడు కళ్ళు తెరవగానే రాముడు, “మహారాజా! నేను దండకారణ్యానికి పోతున్నాను. మీరు ప్రభువు గనక మీ అనుమతి కోసం వచ్చాను. నేనెంత చెప్పినా వినక సీత లక్ష్మణులు నా వెంట బయలు దేరారు. వారి వనవాసానికి కూడా అనుమతి ఇవ్వండి,” అన్నాడు.

 దశరథుడు రాముడితో, “నాయనా, రామా! కైకేయికి వరమిచ్చి నేను మోసపోయాను. నీవు నా ఆనతి అతిక్రమించి పట్టాభిషేకం చేసుకో!” అన్నాడు. “మీరు సత్యదోషం కట్టుకో కండి. అడవికి పోవటానికి నా కేమీ అభ్యంతరం లేదు. పధ్నాలుగేళ్ళూ సుఖంగా వన వాసం చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తాము,” అన్నాడు రాముడు. “మీరు ఇవాళే వెళ్ళాలని ఏమిటి? ఈ రాత్రికి ఇక్కడ ఉండి నా వల్ల మీకు కావలిసిన వన్నీ పొంది, ఈ ఒక్క రాత్రి మమ్మల్నందరినీ సంతోష పెట్టి, రేపు ఉదయం అరణ్యానికి బయలుదేరవచ్చు.” అన్నాడు దశరథుడు. “తండ్రి, మా కోరికలన్నీ మీరు తీర్చినట్టే భావించి మమ్మల్ని వెళ్ళనివ్వండి. మాకు మీ ఆశీర్వాదం ఇచ్చి సంతోషంగా పంపండి. అరణ్యంలో మా కేమీ కష్టాలుండవు. అనేక పర్వతాలూ, సరస్సులూ, వింతలూ చూస్తాం,” అన్నాడు రాముడు.

రాముడడవికి పోతున్నందుకు దశరథుడు పొందే సంతాపం చూసి సుమంత్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చినవాడై, కళ్ళ నిప్పులు రాలుస్తూ, పళ్ళు పటపట కొరుకుతూ, కైకేయితో, “దుష్టురాలా! నిన్ను ప్రాణంకన్న ఎక్కువగా చూసుకునే మహారాజు కింత శోకం తెచ్చిపెట్టావే, నీ వింకేమి చెయ్యలేవు? నీ వాలకం చూస్తే భర్తను చంపుకునేదానివిగానూ, వంశనాశనం కలిగించే దానివిగానూ కనిపిస్తున్నావు. అందరిలోకి పెద్ద కొడుకైన రాముడు పట్టాభిషేకం చేసుకోవటానికి నీ అభ్యంతరం ఏమిటి? భరతుడు రాజ్యం చేస్తే మేమంతా ఇక్కడ ఉంటామనుకుంటున్నావా? అయోధ్యలో ఒక్క బ్రాహ్మడుంటాడా? ఎందుకు చేస్తున్నావీ పాడుపని? మొత్తానికి ఆ తల్లి కూతురనిపించు కున్నావు!

“నీ తండ్రి అయిన అశ్వపతికి ఒక మునీశ్వరుడు ఒక అపూర్వమైన శక్తి ఇచ్చాడు. దానితో ఆయన పశు పక్ష్యాదుల భాషలన్నీ నేర్చుకున్నాడు. ఒకనాడాయన మంచం మీద పడుకుని ఉండగా జృంభమనే ఒక చీమ ఏదో అనేసరికి ఆయన పకపకా నవ్వాడు. అది చూసి మీ అమ్మ, ఎందుకు నవ్వావో చెప్పు అన్నది. ఎందుకు నవ్వానో చెబితే నేను చచ్చి పోతానన్నాడు మీ తండ్రి. నువ్వు చస్తావో, బతుకుతావో నాకు తెలీదు, నన్ను చూసి నవ్వలేదని నాకేమిటి నమ్మకం? అందుచేత నవ్విన కారణం చెప్పాలిసిందే నన్నది మీ అమ్మ. అప్పుడు మీ నాన్న తనకు వరమిచ్చిన ముని దగ్గరికి పోయి ఆయన సలహా అడిగాడు. నీ భార్య చచ్చి గీపెట్టినా చెప్పకు అన్నాడు ముని. అప్పుడు మీ నాన్న మీ అమ్మను వెళ్ళగొట్టి సుఖంగా ఉన్నాడు. నీ ధోరణి కూడా అలాగే ఉంది. తండ్రిని విడిచి రాముడు అడవికి వెళ్ళాడో గొప్ప ఆపద కలిగి తీరుతుంది. అందుచేత నీ వక్రబుద్ధి మాని రాముడి పట్టాభిషేకానికి ఒప్పుకో!” అని హితవు చెప్పాడు.

 ఈ మాటలకు కైక సిగ్గు పడలేదు సరికదా, చలించను కూడా లేదు. దశరథుడు మాత్రం సుమంత్రుడితో, “రాముడి వెంట అడవికి చతురంగ బలాలనూ, విశేష మైన ధనాన్నీ, అందగత్తెలయిన స్త్రీలనూ, సంబారాలతో వర్తకులనూ పంపించు. బళ్లు కూడా వెంట ఇచ్చి పంపించు, రాముడికి రాజ్యం లేదన్నలోపం తెలియకుండా చూడు,” అన్నాడు.

 సుమంత్రుడి శాపనార్థాలకు చలించని కైకేయి ఈ మాటలు విని తెల్లబోయి, బెదిరి, గొంతు ఆర్చుకుపోయి, “మహారాజా, అయోధ్యను పాడుబెట్టి అందరూ వెళ్ళిపోతే భరతుడు పాలించడు!” అన్నది. “ఓసి దుర్మార్గురాలా! నా మీద మొయ్యరానంత బరువువేసింది చాలక ఈ కొరడాదెబ్బలు కూడా ఏమిటి? ఇదంతా ఆ వరాలలోనే చేర్చి అడగక పోయావా?” అన్నాడు. దశరథుడు కోపంగా. కైకేయి అంతకన్న హెచ్చు కోపంతో, ”అది వేరే అడగాలా ఏమిటి? అరణ్యానికి పొమ్మంటే అన్నీ విడిచిపెట్టి పోవటంకాదా? మీ పూర్వీకుడు సాగర చక్రవర్తి తన పెద్ద కొడుకైన అసమంజుణ్ణి వెళ్ళగొట్టి నప్పుడు వాడి వెనకగా సైన్యాన్ని పంపాడా?” అని అడిగింది.

 ఈ మాట విని సిద్ధార్థుడనే మంత్రి, ”అమ్మా! అసమంజుడి మాట ఇక్కడ దేనికి? వాడు పరమ దుష్టుడు. వాడు వీధుల్లో ఆడుకునే పిల్లలను తీసుకుని సరయూ నదిలో పడేసి వాళ్ళు ఎలా చస్తారో చూసి ఆనందించే పాపాత్ముడు. అందుచేత పౌరులు కడుపుమంటతో రాజు వద్దకు వెళ్ళి, ”అయ్యా, తమరు ఆసమంజు వెళ్ళగొడ తారా, మమ్మల్ని దేశం విడిచి వెళ్ళి పొమ్మన్నారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి" అని అడగగా సాగర మహారాజు జనద్రోహి అయిన తన కొడుకునూ, వాడి భార్యనూ, పరివారాన్ని వెళ్ళగొట్టి, వాణ్ణి తిరిగి రాజ్యంలో అడుగు పెట్టనివ్వకుండా కట్టుదిట్టం చేశాడు. జనద్రోహి అసమంజుడికి జనప్రియుడైన రాముడికి సాపత్యం చెప్పావే!" అన్నాడు.

 ఈ మాటలకు కైక చలించక పోవటం చూసి దశరథుడు, ” ఓసి పాపాత్మురాలా ! నిన్ను చూస్తే నీకు హితం తలకెక్కేటట్టు లేదు. నేను కూడా రాముడి వెంట అడవికి పోతాను. నీవూ, భరతుడూ సుఖంగా రాజ్యమేలండి” అన్నాడు. ఈ సంభాషణ అంతా వింటున్న రాముడు తండ్రితో, “మహారాజా! అన్ని సుఖాలు విడిచి, అడవిలో కందమూలాలు తినబోయే నావెంట సేన కూడా దేనికి? ఏనుగును దానం చేసి కట్టుతాడు దగ్గిర లోభించే పద్ధతి మానండి. మాకు నారబట్టలూ, దుంపలు తవ్వుకునే పరికరాలూ, ఒక బుట్టా ఇప్పించండి, చాలు,” అన్నాడు. మానాభిమానాలు విడిచి పెట్టిన కైకేయి, “ఇదుగో, నారబట్టలు తెస్తున్నాను” అంటూ వచ్చింది.

 రామలక్ష్మణులు తమ మేలి వస్త్రాలు విప్పేసి, తండ్రి ఎదటనే నారబట్టలు ధరించారు. సీతకు మాత్రం అవి ఎలా కట్టుకోవాలో తెలియక రాముడి కేసి చూసింది. తరువాత ఒక బట్ట మెడకు చుట్టుకుని, మరొకటి చేత పట్టుకుని, సిగ్గుతో తల వంచి నిలబడింది. అప్పుడు రాముడు చప్పున ఆమె వద్దకు వెళ్ళి, ఆమె చేతిలో ఉన్న నారచీరె తీసుకుని, ఆమె కట్టుకుని ఉన్న పట్టు చీరెపైన దానిని చుట్టాడు. ఇది చూసి దశరథుడి భార్యలు కన్నీరు కారుస్తూ, “నాయనా! నీవు తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళదలిచావు, వద్దన్నా మానవు. కానీ సీతను కూడా ఎందుకు తీసుకుపోతావు? ఆమె వనవాసం చెయ్యలేదు. మా వద్ద విడిచి పెట్టి వెళ్ళు, నాయనా! నీకు బదులుగా ఆమెను చూసుకుంటూ ఉంటాం,” అన్నారు.

 ఈలోపల వసిష్టుడు సీతకు నారచీరె లిస్తున్న కైకేయితో “గుణహీనురాలా! నీ సాహసానికి అంతు లేకుండా ఉన్నాదే. సీత అడవికి వెళ్ళవలసిన అవసరమే మున్నది? రాముడి కోసం సిద్ధం చేసిన పట్టాభిషేకం ఆమెకు జరిపి రాజ్యం పాలించేటట్టు చేయవచ్చు తెలుసా? సీత ఈ నారచీరెలు కట్టవలసిన అవసరం లేదు సరికదా, ఆమె తన వెంట వాహనాలు, వస్తువులు, బట్టలూ, పరిచారికలూ, సమస్తమూ తీసుకుపోవచ్చును. భరతుడు సంతోషిస్తాడని నీవు చేసిన ఈ దుర్మార్గం అతనికి ఎంతమాత్రమూ రుచించదు. అతను దశరథుడి కొడుకే అయితే, తన తండ్రి వ్యథకు కారణమైన రామ వనవాసానికి ఎంతమాత్రమూ సమ్మతించాడు” అన్నాడు.

 చుట్టూ ఉన్నవారు, “ఛీ, ఛీ!” అను కోవటం దశరథుడు విన్నాడు. ఆయన సీతను చూసి, “సుకుమారి, చిన్న పిల్ల! ఆ సీత మునిపత్నిలాగా నారచీరగట్టి ఎలా వెలవెలపోతున్నదో చూడండి! ఆమె నారచీరెలు కట్టటానికి వీల్లేదు,” అన్నాడు. రాముడు బయలు దేరే ప్రయత్నంలో తండ్రికి అప్పగింతలు చెప్పి, తన తల్లి అయిన కౌసల్యను కాపాడమని కోరాడు. దశరథుడు సుమంత్రుడితో, “మంచి గుఱ్ఱాలను పూన్చిన మేలైన రథంలో వీళ్ళ నెక్కించి, నగరం బయట అరణ్యంలో విడిచి పెట్టిరా” అన్నాడు. ధనాధికారిని పిలిచి, “పధ్నాలుగేళ్ళ పాటు సీతకు సరి పోయే మేలైన చీరెలు, నగలూ తీసుకురా,” అని ఆజ్ఞాపించాడు.

 సీత పెళ్ళికి పోతున్న దానిలాగా వికసించిన ముఖంతో తనకోసం తెచ్చిన నగలు పెట్టుకుంటూంటే కౌసల్య ఆమెను రెండు చేతులా ఆలింగనం చేసుకుని, “సీత! నీ భర్త పేదవాడై పోయినాడని వనవాస కాలంలో ఆశ్రద్ధగా చూడకమ్మా” అంటూ నీతిబోధ చేసింది. రాముడు తల్లిదండ్రులకు ప్రదక్షణ సమస్కారం చేసి, తల్లితో, “అమ్మ! దిగులు పడక తండ్రిగారిని కనిపెట్టుకుని ఉండు. పధ్నాలుగేళ్ళంటే ఎంత? కన్ను మూసితెరిచేసరికి గడిచిపోతాయి,” అన్నాడు. లక్ష్మణుడు కూడా తల్లిదండ్రులకు మొక్కి తన తల్లి అయిన సుమిత్ర వద్ద సెలవుతీసుకున్నాడు. ఆమె, “లక్ష్మణా! ఇక నీకు రాముడే తండ్రి, సీతే తల్లి, అరణ్యమే అయోధ్య ! అన్నను ఆపద రాకుండా చూసుకో, నాయనా !” అని చెప్పింది.

 ఆ ముగ్గురూ బయటికి వచ్చారు. పెళ్లి కూతురులాగా అలంకరించుకున్న సీత తాను వనవాసం వెళుతున్నాననే చింత కొంచెమైనా లేకుండా, ముందుగా రథమెక్కి కూచుంది. తరువాత రామలక్ష్మణు లెక్కి కూచున్నారు. సుమంత్రుడు రథంలో సీతకు దశరథుడిచ్చిన వస్త్రాభరణాలు, ఆయుధాలు, కవచాలు, చిన్న గునపమూ, బుట్ట ఉంచాడు. రథం కదిలింది.