వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

అయోధ్య కాండ : రాముడు వనవాసానికి సిద్దమగుట

రాముడు వనవాసానికి సిద్దమగుట

 రాముడు తండ్రి ఆజ్ఞ పాలించటానికి గాను అడవికి వెళ్ళే ధృడనిశ్చయం చేసుకున్నాడని గ్రహించి కౌసల్య అతని క్షేమం కోసం బ్రాహ్మణుల చేత హోమం చేయించి ఆశీర్వదించి పంపింది. రాముడు సీత యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు. పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా తలవంచి కన్నీరు కార్చుతూ, వెంట ఎవరూ లేకుండా వచ్చే భర్తను చూసి సీత కూడా కంపించింది. ఆమె అతని దిగులుకు కారణమడిగింది. జరిగినదంతా చెప్పి రాముడామెతో “నేను అడవుల్లో నుండి తిరిగి వచ్చేవరకు నీవు భరతుడి వద్ద ఉండి అతను చెప్పినట్టు నడచుకో. అతని ఎదట నన్నెప్పుడూ పొగడకు. బంధుత్వం తప్పిస్తే భరతుడు నిన్ను పోషించడానికి కారణం మరొకటి లేదు. అందుచేత నీవు అతను సంతోషించేటట్టు మసలుకో. వృద్ధులైన నా తల్లిదండ్రులను కనిపెట్టి ఉండు” అని చెప్పాడు.

 ఈ మాటలు విని సీత ప్రణయంతో కూడిన కోపంతో “ఇవేం మాటలు నన్ను తేలిక చేసి పరాచకాలు ఆడుతున్నావా ఆడదానికి భర్తే కదా గతి? నిన్ను వనవాసం వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్టు కాదా! నీవు అడవిలో సంచరించటమే జరిగితే ముళ్ళన్నీ నా కాళ్లతో తొక్కి నీకు దారి చేస్తూ నేను ముందు నడవనా? నీవంటి పరాక్రమవంతుడి వెంట ఉండగా నాకు అరణ్యభయం ఉండబోదు. అడవిలోని వారందరిని కాపాడగలవాడివి నన్ను కాపాడలేకపోవు. అడవిలో నేను అది కావాలి ఇది కావాలి అని అడగబోను నీవు లక్ష చెప్పినా సరే నా మనసు మారదు అన్నది.”

 సీత తన వెంట అడవులకు వచ్చి కష్టాలు పడటం రాముడికి కొంచెం కూడా ఇష్టం లేదు. ఆ కష్టాలను వివరించాడు కానీ సీత వాటిని లక్ష్య పెట్టలేదు. “నిన్ను చూసి సాముద్రిక నిపుణులు వనవాసయోగం ఉన్నదని చెప్పినట్టే నన్ను చూసి కూడా జ్యోతిష్యులు నాకు వనవాసయోగం ఉన్నదని చెప్పారు. అందుచేత నేను నీ వెంట అరణ్యానికి వచ్చి తీరుతాను” అన్నది. అప్పటికి రాముడు ఆమెను తీసుకుపోవటానికి సమ్మతించలేదు. సీతకు కోపమూ, దుఃఖము ముంచుకు వచ్చాయి. ఆమె రాముడితో “అయ్యో మా నాన్న అయిన జనక మహారాజు, తన అల్లుడు పురుషరూపంలో ఉన్న ఆడదని తెలిస్తే ఏమనుకుంటాడు. నిన్ను శూరుడని తెలియని వారు అనుకుంటున్నారు. నీ భయం దేనికి? నేనేం తప్పు చేశానని నన్ను విడిచిపెట్టి పోవాలనుకుంటున్నావు? నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు గదా. నేను నిన్ను విడిచిపెట్టి వంశానికి కళంకం తీసుకురావాలా? నీవున్న చోటే నాకు స్వర్గమని చెప్పానే” అంటూ బోరున ఏడ్చింది.

 రాముడామెను రెండు చేతులు దగ్గరికి తీసుకొని సముదాయించి, తన వెంట తీసుకుపోతానని మాట ఇస్తూ వనవాసానికి సిద్ధంకా నీ వద్ద ఉన్నదంతా దానం చేసేయ్యి నీ వస్తు సామాగ్రి యావత్తు ముందు పనివాళ్ళకిచ్చి, మిగిలిన బ్రాహ్మణులకు ఇవ్వు. సన్యాసులకు భోజనం పెట్టు బిచ్చగాళ్లకు దానాలు చేయించు, అన్నాడు. సీత పరమానందంతో ఆ పనులన్నీ సాగించింది.