వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

అయోధ్య కాండ : కైకేయి వరములుకోరుట

కైకేయి వరములుకోరుట

 కానీ ఆ రాత్రే మరొకరకం నాటకం ఆరంభమైంది. కైకేయి వెంట మంధర అనే ఒక గూనె దాసి ఆమెకు ఆరణంగా వచ్చింది. ఆ మంధర ఆ రాత్రి కైకేయి ఉండే మేడపై అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యలో జరిగే సందడి అంతా చూసి ఆశ్చర్యపడింది. తన పక్కనే తెల్ల పట్టుచీర గట్టి నిలబడి ఉన్న ఒక దాదితో మంధర, “ఈ ఆర్భాటమంతా ఏమిటి? మీ కౌసల్య ఏదన్నా వ్రతంపట్టి జనానికి దానధర్మాలు చేస్తున్నాదా? లేక దశరథుడు ఏదన్నా ఉత్సవం తలపెట్టాడా?” అన్నది. దాది పొట్ట చెక్కలయేలాగ నవ్వి, “తెల్లవారగానే రాజుగారు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నారు” అని చెప్పింది.

 గూని మందరకు ఈ వార్త కర్ణ కఠోరమయింది. ఆమె గబగబా మేడదిగి కైకేయి పడుకొని ఉన్న చోటికి వెళ్లి “ఏం పడుకున్నావు, నీ కొంప నిలువునా కూలబోతున్నది ఆ రాజుకు నీ మీద ఉన్న ప్రేమ మరెవరి మీద లేదని మహామురిశావు. ఇక మురుద్దువు గానిలే అన్నది.” “నీ వాలకం చూస్తే ఏదో జరిగినట్టుందే, అందరూ క్షేమంగా ఉన్నారు కదా?” అన్నది కైకేయి. “రేపు దశరథమహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేయబోతున్నాడు, ఇంకేం జరగాలి, ఈ మాట వినగానే నా గుండె జారిపోయింది. నీ మంచి కోరినదాన్ని కనుక ఈ మాట వింటూనే నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను.” అన్నది.

“మందర, నిజంగానా మందర ఎంత మంచి వార్త తెచ్చావు” అంటూ కైకేయి వికసించిన ముఖంతో పక్కమీద లేచికూర్చొని విలువైన ఆభరణం ఒకటి తీసి ఇస్తూ, “ఇంకేం కావాలన్నా ఇస్తాను అడుగు అన్నది.” కైకేయి ఈ ధోరణి మందరకేమి నచ్చలేదు, ఆమె తన యజమానురాలితో “మూఢురాల! నీకు రాబోయే విపత్తు అర్థం చేసుకోలేకున్నావు. లేకపోతే దుఃఖించడానికి బదులు ఆనందిస్తావా, నీకు బదులుకూడా నేనే ఏడుస్తున్నాను. ఎందుకంటావా, రేపు ఈ పట్టాభిషేకం జరగగానే కౌసల్య రాజమాత అవుతుంది. నీవు ఆమెకు పరిచారికవుతావు, రాముని అంతఃపుర స్త్రీలకు నీ కోడళ్ళు దాసీలవుతారు. భరతుడు అతని సంతతి రూపుమాసి పోవాల్సిందే నాకు బహుమానం ఇస్తానంటివే నీకేమీ ఒరిగిందని బహుమానం ఇస్తావు, రాజ్యభిషేకం భరతుడికి జరిగినప్పుడు కదా నేను నీ బహుమానాలు పొందవలసింది.”

“భరతుడు దురాన మామగారు ఇంట్లో ఉండబట్టి గాని దశరథుడు నీపై ప్రేమ కొద్ది అతనికి ఈ పట్టాభిషేకం చేసి ఉండడా, రాముడు రాజయ్యాక భరతుడికి ఇక్కడికి రానవసరం లేదు. అటు నుంచి అటే అడవికి పోవడం మేలు. ఎందుకంటే రాముడు అతన్ని బతకనివ్వడు. నీ భర్త నీ మీద ఎక్కువ ప్రేమగా ఉంటాడన్న అహంకారంతో ఇంతవరకు నీవు కౌసల్యను చాలాలోకువగా చూసావు. ఇక ఆవిడ నీపై పగ తీర్చుకోకుండా ఊరుకుంటుందా నీకు నిజంగా సమర్థత ఉంటే ఈ పట్టం భరతుడికి కట్టంచు. భరతుడికి పోటీ అయిన రాముణ్ణి అడవిలోకి తోయించు. ఇంత రాజ్యానికి భరతుడు రాజవుతాడు నీవు రాజమాతవై గౌరవం పొందుతావు రాముడు రాజయితే నీ పతనం తప్పదు నీ ముఖం చూసేవారు ఉండరు” అని ఎడాపెడా అనేసింది. ఈ మాటలు కైకేయి తలకెక్కాయి ఆమె ముఖం బేపురించింది క్రోధావేశంతో ఆమె మందరను చూసి అవును భరతుడు రాజు కావలసిందే రాము డడవి పాలు కావాల్సిందే కానీ అది ఎలా సాధ్యపడుతుంది అన్నది.