అయోధ్య కాండ : గుహుని ఆతిధ్యము
గుహుని ఆతిధ్యము
గంగానది సమీపాన శృంగిబేరపురమనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గారచెట్టు కింద రథాన్ని నిలిపి, గుఱ్ఱాలను విప్పి, వాటికి మేతపెట్టాడు. సీత రామ లక్ష్మణులు చెట్టు కింద కూచున్నారు. ఇంతలో గుహుడనే బోయరాజు, రాముడికి మంచి స్నేహితుడు, రాముడి రాక గురించి తెలిసి, తన మంత్రులతోనూ, కులపెద్దలతోనూ చూడవచ్చాడు. అతన్ని దూరాన చూస్తూనే రాముడు లక్ష్మణుడితో కూడా ఎదురువెళ్ళి, గుహిడిని ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు విచారంతో, “రామా, ఇదే అయోధ్య అనుకో ! నీవు అతిథిగా రావటం నా అదృష్టం,” అన్నాడు.
తరువాత గుహుడు రాముడికీ, లక్ష్మణుడికీ, సీతకూ మంచి భోజనం సిద్ధంచేయించి, “రామా! నీకు ఏలోపమూ జరగదు. ఈ రాజ్యాన్ని నీవే ఏలుతూ ఉండిపో,” అన్నాడు. రాముడు అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుని, “గుహా! నా కోసం కాలి నడకన వచ్చావు. అంతకన్న ఇంకేం కావాలి? నీ రాజ్యం నీవే ఏలుకో. నేను నారబట్టలు ధరించి అరణ్యవాసం చెయ్యక తప్పదు.” అని నచ్చచెప్పాడు. ఆ రాత్రి రాముడూ, సీత ఆ గారచెట్టు కిందనే పడుకుని నిద్రపోయారు. వారికి రక్షగా మేలుకుని ఉన్న లక్ష్మణుడితో గుహుడు, “నాయనా! నీవుకూడా పడుకుని విశ్రాంతి తీసుకో. తెల్లవార్లూ మీకు మేము కాపు ఉంటాంలే, అరణ్యంలో ఉండే మాకిది పరిపాటే,” అన్నాడు. కానీ లక్ష్మణుడు అలా చెయ్యక గుహుడితో తెల్లవార్లూ మేలుకుని కూచుని, జరిగినదాని గురించి, జరగబోయేదాన్ని గురించి మాట్లాడాడు.
అంతా విని గుహుడు చాలా దిగులు పడ్డాడు. ఆ రాత్రి గడిచి మర్నాడు ఉదయము రాముడు కోయిల కూతలకూ, నెమళ్ళ కూతలకూ మేల్కొన్నాడు. అతను లక్ష్మణుడుడితో, “సూర్యోదయం అవుతున్నది. మనం గంగానది దాటి వెళ్ళిపోదాం,” అన్నాడు. లక్ష్మణుడు వెళ్ళి బోయ రాజైన గుహుణ్ణి సారథి అయిన సుమంత్రుణ్ణి పిలుచుకు వచ్చాడు. రాముడు గుహుడితో తాము గంగానది దాటాలని చెప్పాడు. గుహుడు తన మనుషులను పంపి గంగ దాటటానికి మంచి పడవనూ, నావికుణ్ణి సిద్ధంచెయ్యమన్నాడు.
“రాముడు సుమంత్రుడితో, “సారథీ! నీవిక నగరానికి తిరిగి వెళ్ళు. మా తండ్రిగారితోనూ, తల్లులతోనూ మా క్షేమం గురించి తెలిపి, పధ్నాలుగేళ్ళూ తీరగానే తిరిగివస్తామని చెప్పండి. తరువాత భరతుణ్ణి మేనమామ ఇంటినుంచి తీసుకు వచ్చి రాజ్యాభిషేకం చేయించు” అన్నాడు.
సుమంత్రుడు, “రామ! రణరంగంలో యోధుడు పడిపోగా సారథి ఉత్తరథాన్ని తీసుకుపోయినట్టుగా, మీరు ముగ్గురూ ఎక్కివచ్చిన రథాన్ని ఖాళీగా అయోధ్యకు తీసుకుపోతే ప్రజల గుండెలు పగలవా? ఉత్తరథంతో తిరిగి వెళ్ళి మీ తల్లులకు, నా మొహం ఎలా చూపించను? నేనుకూడా ఈ పధ్నాలుగేళ్ళూ మీ వెంటనే వస్తాను” అన్నాడు. “అలా కాదు, సారథీ. నీవిక్కడే ఉండి పోతే మేము అరణ్యానికి వెళ్ళినట్టు కైకేయికీ, తమ ఆజ్ఞ పాలించినట్టు తండ్రిగారికీ ఎలా తెలుస్తుంది? కనక, నీవు తిరిగి వెళ్ళి తీరాలి,” అన్నాడు రాముడు.