అయోధ్య కాండ : చిత్రకూటావాసము
ఏప్రిల్ 1962
చిత్రకూటావాసము
ఆ రాత్రి వారు ముగ్గురు భరద్వాజుడు చెప్పిన కథలు అనేకం విని నిద్రపోయారు. మర్నాడు ఉదయం భరద్వాజుడు వారిని కొంతదూరం సాగనంపి, చిత్రకూటానికి తాను అనేక మార్లు వెళ్ళి వచ్చిన తోవ గుర్తులు చెప్పాడు.
సీతారామ లక్ష్మణులు ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఆయన చెప్పిన దారినే నడుస్తూ యమునా నదిని దాటవలసిన రేవు వద్దకు వచ్చారు. అక్కడ లక్ష్మణుడు కొయ్యల మీద ఎండిన వెదుళ్ళతో ఒక విశాలమైన తెప్ప తయారు చేశాడు. దానిపైన నేరేడు కొమ్మలతోనూ, పట్పలి తీగలతోనూ ఒక సుఖమైన ఆననం సీత కోసం అమర్చాడు. తెప్ప మీద తమ వస్తువుల నన్నిటిని ఉంచి తాము కూడ ఎక్కి, నదిని దాటారు. వసంత కాలం కావటంచేత అడివిచెట్లు పుష్పంచ మహాశోభగా ఉన్నాయి. మోదుగు చెట్లనిండా ఎఱ్ఱటి పూలున్నాయి. సీత ఇప్పుడు ఆ వసంత శోభను చూసి ఆనందించటం మొదలుపెట్టింది. “లక్ష్మణుడు ఆమె ముందు నడుస్తూ, ఆమె కోరిన ప్రతి పువ్వూ. ప్రతి పండూ కోసి తెచ్చి ఇస్తూ, ఆమె చెట్లను గురించి అడిగే ప్రశ్నలన్నిటికి సమాధానాలు ఇచ్చాడు. ఆ రాత్రి ఒక చదువైన చోటు చూసుకుని అక్కడ నిద్రపోయారు. తెల్లవారుతూనే రాముడు లేచి చిత్రకూటానికి ప్రయాణం సాగించాడు. చిత్రకూట ప్రాంతంలో రాముడు ఒక స్థలం చూసి అక్కడ పర్ణశాల నిర్మిద్దమన్నాడు. లక్ష్మణుడు మంచి గుంజలు నరికి తెచ్చి వాటితో దృఢమైన పర్ణశాలకి కావాల్సిన అవసరమైన విభాగాలూ నిర్మించాడు. ఆ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు శాస్త్రీయంగా గృహప్రవేశం చేసి, పక్కనే ప్రవహించే మాల్యావతీ నదిలో స్నానాలు చేస్తూ, చుట్టూ ఉండే అరణ్య ప్రాంతంలో విహరిస్తూ, పట్టణ జీవితాన్ని మరిచి సుఖంగా కాలం గడపసాగారు.
అక్కడ శృంగిబేరపురంలో గుహుడూ, సుమంత్రుడూ గంగ ఒడ్డున నిలబడిన సీతారామ లక్ష్మణులు కనుమాటు అయినదాకా చూసి గుహుడి ఇంటికి వెళ్ళిపోయారు. రాముడు మనసు మార్చుకుని తిరిగి వస్తాడేమోనని మూడు రోజులు చూసి సుమంత్రుడు ఖాళీ రథంతో అయోధ్యకు బయలుదేరి, రాముడు అయోధ్య విడిచి వెళ్ళిన అయిదు రోజులకు తిరిగివచ్చాడు. దారిలో పౌరులు ఖాళీగా రథం తిరిగి రావటం చూసి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకున్నారు.