అయోధ్య కాండ : భరతుడు చిత్రకూటము చేరుట
భరతుడు చిత్రకూటము చేరుట
రాముడు చిత్రకూటానికి వచ్చి నెల అయింది. ఈ రోజే అతను తన పర్ణశాల విడిచి సీతతో సహా కొండ మీద విహరించడానికి బయలుదేరాడు. చిత్రకూట పర్వతం చాలా అందమైనది. అక్కడి చెట్లూ, మృగాలూ, చిత్రవిచిత్రమైన ధాతువులూ, పక్కనే ప్రవహించే మందాకినీ నదీ, మనోహరమైన దృశ్యాలు చూస్తూ వారిద్దరూ చాలాసేపు విహరించారు. రాముడు సీతతో, “నీవూ, లక్ష్మణుడూ నా వెంట ఉంటే ఈ దృశ్యాలు చూసి ఆనందిస్తూ ఎన్ని ఏళ్ళపాటయినా ఇక్కడే ఉండిపోగలను” అన్నాడు.
ఇలా చాలాసేపు విహరించిన పిమ్మట సీతారామలక్ష్మణులు ఒకచోట కూచున్నారు. అదే సమయంలో రాముడికి పరిగెత్తుతున్న ఆడవి ఏనుగులు కనిపించాయి. అవి చేసే అరుపులు వింటే భయపడి పరిగెత్తు తున్నట్టు కనబడ్డాయి. నిజానికవి భరతుడి వెంట ఉండే పేనను చూసి బెదిరినవే.
రాముడు లక్ష్మణుడితో, “చూడు, లక్ష్మణా! ఏనుగులూ, ఎనుబోతులూ, సింహాలూ కూడా బెదిరి పారిపోతున్నాయి. ఎవరైనా. రాజు వేటాడుతున్నాడా? లేక ఈ అడవి మృగాలను మించిన క్రూరమృగమేదైనా వచ్చిందా? కారణం మేమిటో చూడు!” అన్నాడు. లక్ష్మణుడు ఎత్తయిన చెట్టెక్కి అన్ని దిక్కుల కలయజూసేసరికి ఉత్తర దిక్కుగా పెద్ద సేన కనబడింది. అతను రాముడితో, “ఏదో పెద్ద సేన మనకేసి వస్తున్నది. అగ్ని చల్లార్చి, సీతను గుహలో దాచి, కవచం తొడిగి, ధనుర్బాణాలు, తీసుకో” అన్నాడు. “సరిగా చూడు, లక్ష్మణా! అది ఎవరి సేనలాగుంది?” అన్నాడు రాముడు. లక్ష్మణుడు సేన మధ్య కనిపించే రథాలకు కట్టిన ధ్వజాలను గుర్తించి, “భరతుడు తల్లి ధర్మమా అంటూ రాజ్యాభిషేకం చేసుకుని, అంతటితో తృప్తిచెందక తన రాజ్యం నిష్కంటకం చేసుకోవటానికి మనని చంపటానికి వస్తున్నాడు. మనం పర్వతం మీద దాక్కుందామా? లేక యుద్ధ సన్నద్ధులమై ఇక్కడే ఉందామా?" అని రాముణ్ణి అడిగాడు.
అతను అంతటితో ఆగక, “ఇప్పుడు భరతుడు మనకు చిక్కబోతున్నాడు. మనకి కష్టాలన్నీ తెచ్చిపెట్టిన ఈ భరతుణ్ణి తప్పక చంపేస్తాను. అందులో తప్పేమీ లేదు. పైగా భరతుడు చస్తే నీవు హాయిగా రాజువు కావచ్చు. కైకేయినీ, ఆ మంథరనూ, వాళ్ళవాళ్ళ నందరినీ కూడా చంపేస్తాను. అటువంటి పాపులు బతికి ఉండ రాదు,” అన్నాడు. ఈ మాటలు విని రాముడు తన తమ్ముణ్ణి మెత్తగా చివాట్లు పెట్టాడు. “తనకుతానై భరతుడు మనను వస్తుంటే యుద్ధం చేస్తానంటా వేమిటి? తండ్రి మాట నిలబెట్టటానికి ఇక్కడికి వచ్చినవాణ్ణి, భరతుణ్ణి చంపేసి లోకనిందకు పాలుకమ్మంటావా? కొంచెం నష్టం కలగగానే తండ్రినీ, తమ్ములను చంపుకుంటారా? భరతుణ్ణి ఎందుకు శంకిస్తున్నావు? అతను ఎన్నడైనా అనుమానించదగిన మాటలైనా నీతో అన్నాడా? అతను మామగారి ఇంటి నుంచి అయోధ్యకు వచ్చి, మన సంగతి విని మనని తిరిగి తీసుకెళ్లే ఉద్దేశంతో వస్తూ ఉంటాడని నా నమ్మకం. నీకు నిజంగా రాజ్యకాంక్ష ఉంటే చెప్పు, భరతుడు రాగానే రాజ్యం నీ కిమ్మంటాను. అతను నా మాట కాదనడు.” ఈ మాటలకు లక్ష్మణుడు సిగ్గు పడి తల వంచుకుని, “మన తండ్రే మనని చూడటానికి వస్తూ ఉండవచ్చు,” అని మాట మార్చాడు. రాముడు లక్ష్మణున్ని చెట్టు దిగి రమ్మన్నాడు. లక్ష్మణుడు దిగి వచ్చాడు.