వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

అయోధ్య కాండ : భరతుడు భరద్వాజాశ్రమము చేరుట

భరతుడు భరద్వాజాశ్రమము చేరుట

 మంత్రులు ఆశ్రమంలో నిలిచిపోయారు, వసిష్ఠ భరతులు భరద్వాజుడి కుటీరానికి వెళ్ళారు. వారని చూస్తూనే భరద్వాజుడు, “అర్ఘ్యం తీసుకు రండి,” అని కేక పెట్టి లేచి నిలబడ్డాడు. భరతుణ్ణి వసిష్ఠుడు పరిచయం చేసినాక క్షేమసమాచారాలడిగి, “నాయనా! నీవు రాజ్యంచేసుకోక ఇలా ఎందుకు వచ్చావు?” అన్నాడు. భరతుడు రామలక్ష్మణులకు ద్రోహం తలపెట్టి వచ్చాడన్న అనుమానం ఆయనకు కూడా కలిగింది. భరతు అందుకు ఎంతో నొచ్చుకుని, భరద్వాజుడితో తన ఉద్దేశం చెప్పాడు. అంతా విని భర్తద్వాజుడు సంతోషించి, “సీతారామలక్ష్మిణులు చిత్రకూటంలో ఉంటున్నారు. ఇవాళ ఇక్కడ ఉండి రేపు పోదువుగాని,” అన్నాడు. ఇందుకు భరతుడు సమ్మతించాడు.

 “నీ సేనలకన్నిటికీ నేను విందు చేయాలనుకుంటున్నాను. వారి నందరినీ దూరాన ఎందుకు ఉంచి వచ్చావు? ఇక్కడికి వారిని కూడా నీ వెంట తేవలిసింది,” అన్నాడు భరద్వాజుడు. “మహాత్మ! ముని ఆశ్రమాలకు సేనలు దూరంగా వెళ్ళాలన్న నియమాన్ని బట్టి నేను దూరంగా ఉంచాను” అని భరతుడు సవనియంగా చెప్పాడు. “ఫరవాలేదు, నీ సేనను పిలిపించు,” అని భరతుడితో చెప్పి భరద్వాజుడు తన దగ్గరకు అపూర్వమైన ఆతిథ్యం ఏర్పాటుచేశాడు. విశ్వకర్మ వచ్చి క్షణంలో ఇళ్ళు ఏర్పాటుచేశాడు. నదులన్నీ వచ్చి నీరూ, మైరేయం అనే మద్యమూ సిద్ధంచేశాయ్. దిక్పాలకులు పిలిపించారు. పాటలు పాడటానికి విశ్వావసువూ, హాహా, హూహూ అనే గంధర్వులు, అనేకమంది అప్సరసలు పిలిపించారు. చంద్రుడు వచ్చి చతుర్విధాన్నాలు, పుష్పమాలలూ, పానీయాలూ, మాంసాలూ సిద్ధంచేశాడు.

 మయుడు నిర్మించిన అద్భుతమైన భవనాలలో ఒక రాజగృహంలాటిది భరతుడికి ప్రత్యేకించబడింది. అందులో సిహాసనంతో కూడిన రాజసభ ఉన్నది. భరతుడు సింహాసనం మీద కూర్చున్నాక, మంత్రుల ఆసనంపైన కూచుని తన పరివారాన్నీ, గుహుణ్ణి యధోచితస్థానాలలో కూచోబెట్టాడు. బ్రహ్మదేవుడూ, కుబేరుడూ, దేవేంద్రుడూ తలా ఒక ఇరవైవేలమంది అప్పరసలనూ పంపారు. భరతుడు కొలువుతీరి ఉండగా నారద తుంబుర గోపులనే గంధర్వ రాజులు గానం చేశారు. అలంబున, మిశ్ర కేశి, పుండరీక, వామన అనే అప్సరసలు భరతుడి ముందు నృత్యం చేశారు. భరద్వాజాశ్రమంలో గల చెట్లూ, పొదలూ, లతలూ స్త్రీ రూపాలు ధరించి భరతుడి సైనికులకు స్నానాలు చేయించారు “మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, తినండి,” అని వారిని హెచ్చరించాయి.

సైనికులకు ఏలోటూ లేదు. వారు బాగా తిని, తాగి ఆనందపారవశ్యంలో మైమరచి, “మేము అయోధ్యకు పోము, దండకారణ్యానికి పోము, ఇక్కడే ఉంటాము. రాముడూ, భరతుడూ క్షేమంగా ఉందురు. గాక!” అన్నారు. కొందరు, ” స్వర్గమంటే ఇదే!” అని కేకలుపెట్టారు. వాళ్ళు పూలమాలలు ధరించి అటూ ఇటూ పరిగెత్తారు, పాటలు పాడారు, నృత్యాలు కూడా చేశారు. రకరకాల పాయసంతో, మజ్జిగ పెరుగులతో దివ్యంగా తయారు చేసిన ఆహారాన్ని ఎంత తిన్నా వారికి తనివి తీరలేదు. ఆ రాత్రి అలా గడిచిపోయింది.మర్నాడు భరతుడు భరద్వాజుడి దర్భాసనం చేరి, తమకు జరిగిన అతిథ్యానికి కృతజ్ఞత చెప్పుకుని, రాముణ్ణి చేరటానికి మార్గం అడిగాడు. చిత్రకూటానికి వెళ్ళటానికి దక్షిణంగా ఒక మార్గమూ, నైరృతి దిశగా ఒక మార్గమూ ఉన్నాయి, సేనలు నడవటానికి ఏది యోగ్యమో చూసుకుని వెళ్ళమనీ భరద్వాజుడు సలహా ఇచ్చాడు.

 దశరథుడి భార్యలు ముగ్గురూ మునికి మొక్కారు. భరతుడు తగిన రీతిగా వారిని మునికి పరిచయం చేశాడు. తన తల్లిని పరిచయం చేసేటప్పుడు అతను పరుషంగా మాట్లాడుతూ, కోపంతో దహించుకుపోయాడు. అది చూసి భరద్వాజుడు, ” రాముడు అడవికి వెళ్ళటం కైకేయి దోషంచేత ఒక్కటేనని అనుకోకు. అందువల్ల ముందు చాలా లాభం కలుగుతుంది,” అన్నాడు. భరతుడు భరద్వాజముని వద్ద యధోచితంగా సెలవుతీసుకుని తన బలగంతో చిత్రకూటానికి బయలుదేరాడు. వారు చివరకు మందాకినీ నదిని దాటి, దానికి దక్షణంగా ఉన్న చిత్రకూట పర్వతాన్నీ చేరారు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నదీ జాడ తెలుసుకు రమ్మని భరతుడు సైనికులను పంపాడు.

 కొందరు సైనికులు అడవి ప్రవేశించి ఒక చోట పొగ వస్తూండటం గమనించి ఆ సంగతి భరతుడితో చెప్పారు. ఆ పొగ వచ్చేచోట ఎవరో ఉన్నారు. అయితే వారు రామలక్ష్మణులు కావాలి.. లేదా రామలక్ష్మణుల జాడ ఎరిగిన మునులైనా కావాలి. భరతుడు సేనను నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించి, సుమంత్రుడితో, సైనికులు చెప్పిన దిక్కుగా బయలుదేరాడు.