వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

అయోధ్య కాండ : భరతుడు అయోధ్యకు వచ్చుట

భరతుడు అయోధ్యకు వచ్చుట

 సిద్ధార్థుడు విజయుడు జయంతుడు అశోకుడు నందనుడు అనే వారిని పిలిచి వశిష్ఠుడు వారితో “మీరు వేగంగగల గుఱ్ఱాలపైన కేకేయ రాజు ఉండే రాజగృహానికి వెళ్ళి, భరతుడితో ఇక్కడ ఒక ముఖ్య కార్యముందని మేము రమ్మన్నామని చెప్పండి. మీరు అతనితో రాముడు అడవికి వెళ్ళిన వృత్తాంతం గాని, రాజుగారు చనిపోయిన సంగతి గాని చెప్పనే వద్దు” అని చెప్పి పంపారు.

వాళ్లు అనేక నదులు పర్వతాలు దాటి దీర్ఘ ప్రయాణం చేసి భరతుడి మేనమామగారి దేశం చేరి అతని మేనమామకు తాతగారికి కానుకలుగా తెచ్చిన వస్త్రాభరణాలు భరతుడికి అందించి వశిష్ఠుడు చెప్పమన్న మాటలు చెప్పారు. భరతుడు పెద్ద వాళ్ళ అనుమతి తీసుకుని అయోధ్యనుంచి తనకోసం వచ్చిన వారి వెంబడి పెద్ద బలగంతో సహా బయలుదేరాడు మిగిలిన పరివారాన్ని నింపాదిగా వెనక రానిచ్చి భరత శత్రుఘ్నులు రథంలో ముందుగా అయోధ్యనగరానికి ఏడు రోజులకు చేరుకున్నారు. దూతలు అయోధ్యనుంచి వచ్చిన రాత్రే భరతుడికి ఒక పీడకల వచ్చింది అది వచ్చినప్పటి నుంచి అతని మనసులో ఏదో ఆందోళనగానే ఉన్నది. అయోధ్యలో ప్రవేశించగానే అతని ఆందోళన తిరిగి వచ్చింది. ఎందుకంటే, సాధారణంగా ఉండే ఉల్లాసము లేదు. జనం నీరసించి నట్లున్నారు. నగరం పాడుపడినట్టుంది. భరతుడు ముందు తన తండ్రి నగరానికి అక్కడ ఆయన కనిపించకపోయేసరికి తన తల్లి ఇంటికి వచ్చాడు. ఆసనం మీద నుంచి లేచి తన కాళ్లకు నమస్కారం చేసిన భరతుడి తన చెంత కూచోబెట్టుకుని కుశల ప్రశ్నలు వేస్తూ “నీవు బయలుదేరి ఎన్నాళ్ళు అయింది నాయనా! మీ మామ తాత క్షేమంగా ఉన్నారా నీకు అక్కడ సుఖంగా జరిగిందా?” అని ప్రశ్నించింది.

 భరతడు అన్నిటికీ సమాధానమిచ్చి “అమ్మ నాన్నగారెక్కడ? పెద్దమ్మ కౌసల్య ఇంట ఉన్నాడా? నేను ఆయన కాళ్లకు మొక్కాలి” అన్నాడు “ఆయన పెద్దల్లో కలిసిపోయారు నాయనా!” అంటూ కైకేయి చావు కబురు చల్లగా చెప్పింది ఈ మాట వినగానే భరతుడు కుప్పకూలిపోయాడు కైకేయి అతన్ని ఊరడించినది.