వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

అయోధ్య కాండ : భరత గుహుల సంవాదము

 జూన్ 1962
భరత గుహుల సంవాదము

 గుహుడు భరతుడికి సహాయం చేస్తానన్నాడేగాని అతని సందేహం ఇంకా బాధిస్తూనే ఉన్నది. అతను భరతుడితో, “అయ్యా! నీ సేన, అట్టహాసమూ చూస్తే నా కేదో అనుమానంగా ఉన్నది. నీవు వెళ్ళేది రాముడికి ద్రోహం తలపెట్టుట కాదుగదా?" అని అన్నాడు. ఈ మాటకు భరతుడు బాధపడి, “నీకీ అనుమానం కలగటం కన్నా పెద్ద కష్టం నా కేమి ఉంటుంది? పెద్ద అన్న అయిన రాముడు నాకు తండ్రితో సమానం కాదా? రాముణ్ణి తీసుకురావటానికే నేను పోతున్నాను. నా మాట నమ్ము,” అన్నాడు.

 “మంచిమాట అన్నావు, బాబూ నీలాగా చేతికందిన రాజ్యాన్ని విడిచిపుచ్చేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నీకీర్తి శాశ్వతం,” అన్నాడు గుహుడు. అస్తమయమై చీకటి పడింది. ఆ రాత్రి భరతశత్రుఘ్నులు పడుకుని రాముణ్ణి గురించి చాలా దుఃఖించారు. వారివెంట ఉన్న గుహుడు వారిని ఓదార్చాడు. అతను లక్ష్మణుణ్ణి గురించి గొప్పగా చెప్పాడు “రాముడు నిద్రపోతున్నప్పుడు తాను మేలుకునే ఉన్నాడు. మేమందరమూ మేలుకుని ఉండి రాముడికి ఏ భయమూ లేకుండా కాపాడతాము, నిద్రపొమ్మని చెప్పాను. కానీ విన్నాడు కాదు. రాముడూ, సీత కటిక నేలపై పడుకున్నందుకే తన ప్రాణాలు కొట్టుకుపోతూ ఉంటే నిద్ర ఎలాపడుతుందని అడిగాడు. రాముణ్ణి వదిలి దశరథుడు ఒక్కరోజు బతుకుతాడా? అన్నాడు. పధ్నాలుగేళ్ళు వనవాసం చేసి మేము మళ్ళీ అయోధ్యకు తిరిగిపోతామా? అని చింతించాడు. అదుగో, ఆ మఱ్ఱిచెట్టు కిందనే రామలక్ష్మణులు, జడలుధరించారు. తెల్లవారినాక నేను వారి చేత గంగ దాటించాను.”

 గుహుడు ఈ విధంగా చెప్పుకుపోతూ ఉంటే భరతుడికి దుఃఖం పెరిగిపోయింది. కౌసల్య, సుమిత్ర, కైకా కూడా అతనున్న చోటికి వచ్చారు. వారి ఆసక్తి చూసి గుహుడు వారితో రాముణ్ణి గురించి ప్రతి వివరమూ చెప్పాడు. సీతారాములు గారచెట్టు కింద పడుకున్న చోటు కూడా చూపించాడు. దశరథ మహారాజు పెద్దకొడుకు ఆ చెట్టు కింద దర్భలు పరుచుకుని పడుకోవటం భరతుడు ఊహించనైనా ఊహించలేకపోయాడు. ఆ రాత్రి గడిచినాక గుహుడు వచ్చి భరతుడికి నమస్కారంచేసి, ” రాత్రి సుఖంగా గడిచిందా?” అని అడిగాడు. “మాకు ఏలోటూ జరగలేదు. మమ్మల్ని నది దాటించే ఏర్పాట్లు చేయి,” అన్నాడు భరతుడు.

 గుహుడు అయిదువందల పడవలూ, స్వస్తిక అనే పేరు గల మేలుజాతి ఓడలు. సిద్ధం చేయించాడు. తెల్ల కంబళి పరిచిన ఒక స్వస్తికంలో భరతశత్రుఘ్నులూ, వసిష్టుడూ, రాజుభార్యలూ ఎక్కారు. భరతుడి సేన, రథాలూ, బళ్ళూ, వాటినిలాగే జంతువులూ, సంబరాలూ, సమస్తమూ పడవలలోకి ఎక్కించారు. పడవలు నది దాటాయి. ఏనుగులు నదికి అడ్డంగా ఈదాయి. అలాగే కొందరు మనుషులుకూడా ఈదారు. మరి కొందరు తెప్పలమీద, కుండల సహాయం తోనూ నది దాటారు. భరతుడు ప్రయాగవనానికి సపరివారంగా చేరుకుని, వసిష్ఠాదుల సలహాతో భరద్వాజ మహర్షిని చూడడానికి బయలుదేరాడు. భరద్వాజాశ్రమం కోసు దూరంలో ఉండగానే సైన్యమంతా ఆగిపోయింది. భరతుడు తన ఆయుధాలూ, ఆభరణాలు తీసివేసి, పట్టుబట్టలు కట్టుకుని, వసిష్ఠుణ్ణి, మంత్రులనూ వెంటబెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళాడు.